Kavitha: తెలంగాణ రాజకీయలోకి కొత్త పార్టీ వచ్చింది శనివారం ఉదయం మేడ్చల్ ఓఆర్ఆర్ సమీపంలోని మునీరాబాద్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్సీ కవిత తన కొత్త పార్టీ “తెలంగాణ రాష్ట్ర సేన” (TRS) పేరును ఇంకా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం సొంత కుటుంబం ఇంకా ప్రస్తుత ప్రభుత్వంపై యుద్ధ ప్రకటనలా సాగింది.
సొంత తండ్రిపై ‘ధర్మయుద్ధం’
కేసీఆర్ పదేళ్ల పాలనపై కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆనాటి కేసీఆర్ వేరు, ఈనాటి కేసీఆర్ వేరు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకున్న కేసీఆర్ ఇప్పుడు గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో ఖైదీ అయ్యారు. ఆయన మన మనిషి కాదు, ఒక మరమనిషిలా మారారు” అని ఆమె ధ్వజమెత్తారు.
కేసీఆర్ పాలించిన పదేళ్ల కుటుంబంలో తాను భాగమైనందుకు సిగ్గుపడుతున్నానని, దానికి కేవలం క్షమాపణ చెబితే సరిపోదని.. ప్రాయశ్చిత్తం కోసమే ‘TRS’తో ప్రజల ముందుకు వస్తున్నానని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
రాష్ట్రంలో కర్కోటక పాలన.. నిఘా నీడలో తెలంగాణ!
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనా, గత కేసీఆర్ పాలనలోని లోపాలపైనా ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో దారుణమైన నిఘా నీడలో ప్రజలు బతుకుతున్నారని, ఎవరి ఫోన్ ఎవరు వింటున్నారో అనే భయం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ‘కర్కోటకుడు’, ‘హిట్లర్’ తో పోలుస్తూ.. ప్రజల ఇళ్లు కూలుతుంటే ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం అవినీతి – పందికొక్కుల రాజ్యం
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు కవిత సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ పక్కన కాళేశ్వరంలో అవినీతి చేసిన పందికొక్కులు ఉన్నారని, వారి వల్లే ప్రాజెక్టు దెబ్బతిందని ఆరోపించారు. పదేళ్లలో లక్షలాది కోట్లు ఖర్చు చేసినా కేవలం 18 లక్షల ఎకరాలకే నీరు ఇచ్చారని లెక్కలతో సహా నిలదీశారు.
హామీలు ప్రకటన
పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత
విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం
1.విద్య: ప్రైవేట్ స్కూళ్లలోనూ ఉచితంగా విద్య అందిస్తాం
2.వైద్యం: ఏ ఆస్పత్రికి వెళ్లిన ఉచిత వైద్యం అందేలా చేస్తాం
3.వ్యవసాయం: రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేస్తాం
4.ఉపాధి: రూ.2 లక్షల రూ.20 కోట్ల వరకు యువతకు రుణాలు
5. సామాజిక న్యాయం సాధించాల్సిందే
