Chandrababu Naidu: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్న ‘క్లీన్ ఎనర్జీ’ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా త్వరలోనే దేశంలోనే నంబర్ వన్ జిల్లాగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఏ కొత్త పెట్టుబడులు వచ్చినా అనకాపల్లి జిల్లాకే ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
అనకాపల్లి జిల్లాను మరో ‘రంగారెడ్డి జిల్లా’గా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గతంలో వెనుకబడిన ప్రాంతంగా ఉన్న రంగారెడ్డి జిల్లా ఇప్పుడు దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా ఎలా మారిందో, అనకాపల్లి కూడా అదే బాధ్యతతో అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు. ఈ కొత్త క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,100 మంది యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతాన్నిస్తుందని వెల్లడించారు.
రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతోందని సీఎం వివరించారు. కేంద్ర ప్రభుత్వం 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా పెట్టుకుంటే, ఆంధ్రప్రదేశ్ ఒక్కటే 160 గిగావాట్ల ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుందని చెప్పారు. ఇప్పటికే 90 గిగావాట్ల ఉత్పత్తికి అనుమతులు ఇచ్చామని, దీనివల్ల రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. రాంబిల్లిలో తయారయ్యే సోలార్ ఉత్పత్తుల వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం తప్పుతుందని ఆయన అన్నారు.
రవాణా రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 1,050 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని, వీటి కోసం వెయ్యికి పైగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే మూడేళ్లలో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను 5 వేలకు పెంచుతామని, భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారుతాయని ఆయన వివరించారు. ఈ పారిశ్రామిక ప్రగతితో ఆంధ్రప్రదేశ్ పర్యావరణహిత అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా మారుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
