Crime News: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో గురువారం ఉదయం ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలు, అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కట్టుకున్న భార్యనే కసాయిలా మారి భర్త హతమార్చడం స్థానికంగా కలకలం రేపింది.
పట్టణంలోని చాంద్ వీధిలో పుష్ప (26) అనే మహిళ తన భర్త, పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం భార్యపై అనుమానంతో భర్త ఆమెతో గొడవ పడ్డాడు. ఆవేశం పట్టలేక ఇంట్లోని కత్తితో పుష్ప గొంతు కోసి కిరాతకంగా చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
తల్లి రక్తపు మడుగులో పడి ఉండటం చూసి ఆమె చిన్న పిల్లలు భయంకరంగా ఏడవడం మొదలుపెట్టారు. పిల్లల ఏడుపు విన్న ఇరుగుపొరుగు వారు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా, పుష్ప మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. ఈ ఘోర కలిని చూసి వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. నిందితుడైన భర్త కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. కేవలం అనుమానంతో ఇద్దరు చిన్న పిల్లలను తల్లికి దూరం చేసిన ఈ ఘటన ఆ వీధిలో విషాద ఛాయలు నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
