Mallu Ravi: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇటీవల కేసీఆర్, జీవన్ రెడ్డి చేసిన విమర్శలను ఎంపీ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ రాజకీయ శైలిపై మల్లు రవి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. ఇతరులను నమ్మించి మోసం చేయడం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కేసీఆర్ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని రుజువైందని, అందుకే ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ వైపు నిలబడ్డారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజల మద్దతు ఉన్న ఈ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జీవన్ రెడ్డిపై విమర్శల బాణాలు
దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన జీవన్ రెడ్డి.. ఇప్పుడు పార్టీని విమర్శించడంపై మల్లు రవి ఆవేదన వ్యక్తం చేశారు. “రావణుడి చేతిలో విభీషణుడు భంగపడ్డట్లుగా, కేసీఆర్ చేతుల్లో జీవన్ రెడ్డి మోసపోవడం ఖాయం” అని ఆయన జోస్యం చెప్పారు. గత 42 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్నో పదవులు అనుభవించిన జీవన్ రెడ్డి, ఇప్పుడు తన వ్యక్తిగత పంతం కోసం పార్టీని వీడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. కేవలం తను చెప్పినట్లు పార్టీ వినలేదన్న ఒకే ఒక్క కారణంతో, ఇంతకాలం కాపాడుకున్న తన వ్యక్తిగత ప్రతిష్టను ఆయనే స్వయంగా దిగజార్చుకున్నారని మల్లు రవి విమర్శించారు.
సిద్ధాంతాలకు విరుద్ధం..
లెఫ్ట్ భావజాలం ఉన్న జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి, ఇప్పుడు బిఆర్ఎస్ (BRS) వంటి పార్టీలో చేరడం రాజకీయంగా విచారకరమని మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ గురించి జీవన్ రెడ్డి ఎన్నిసార్లు తప్పుగా మాట్లాడితే, అన్ని సార్లు తనను తాను తిట్టుకున్నట్లేనని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ క్రమశిక్షణను కాదని వెళ్లిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
కుల గణనపై స్పష్టత
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన గురించి మాట్లాడుతూ.. ఇది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన ఆలోచనల మేరకే జరుగుతోందని స్పష్టం చేశారు. వారి మార్గదర్శకత్వంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం కోసం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని మల్లు రవి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదలు, బడుగు బలహీన వర్గాల పక్షానే ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
