Lok Sabha Seats

Lok Sabha: దేశ రాజకీయాల్లో మార్పు దిశగా.. లోక్‌సభలో మూడు కీలక బిల్లుల ప్రవేశం.

Lok Sabha: దేశ రాజకీయాల్లో ఒక చరిత్రాత్మక మార్పుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా గురువారం లోక్‌సభలో మూడు అత్యంత కీలకమైన బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా లోక్‌సభ సీట్లను పెంచడం ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశం. ఉదయం సభ ప్రారంభం కాగానే కేంద్ర మంత్రులు అమిత్ షా, అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ బిల్లులను సభ ముందు ఉంచారు.

ఈ బిల్లుల ప్రక్రియలో భాగంగా నియోజకవర్గాల పునర్విభజన కోసం కమిషన్‌ను ఏర్పాటు చేసే బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 550 నుండి గరిష్ఠంగా 850కి పెంచాలని ప్రతిపాదించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగానే ఈ మార్పులు చేయాలని 131వ రాజ్యాంగ సవరణ బిల్లులో పేర్కొన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పరిధి మారి, కొత్త సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అయితే, ఈ బిల్లులను ప్రవేశపెట్టే సమయంలో విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించగా, బిల్లుకు మద్దతుగా 251 ఓట్లు, వ్యతిరేకంగా 185 ఓట్లు వచ్చాయి. మెజార్టీ రావడంతో ప్రభుత్వం బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో దీనికి లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 292 మంది సభ్యులు ఉండగా, మిగిలిన సభ్యుల మద్దతు కూడగట్టడంపై ఉత్కంఠ నెలకొంది.

ఈ బిల్లులపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగనుంది. అంతకంటే ముందు సభలో సుదీర్ఘ చర్చ జరగనుండగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీనిపై ప్రసంగించనున్నారు. ఒకవేళ ఈ బిల్లులు ఆమోదం పొందితే, దేశంలో నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు మహిళలకు చట్టసభల్లో ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంటుంది. విపక్ష కూటమి ఈ బిల్లులను వ్యతిరేకిస్తుండటంతో రేపటి ఓటింగ్ ఫలితంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *