Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్ ఖేల్ ఖతం.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురులేదు

Mahesh Kumar Goud: తెలంగాణ రాజకీయాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నిజామాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ పని అయిపోయిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అసలు పోటీనే లేదని గట్టిగా చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరు కొత్త పార్టీ పెట్టినా, పాదయాత్రలు చేసినా తమకు అభ్యంతరం లేదని.. చివరకు కేటీఆర్ పాదయాత్ర చేసినా తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని ఆయన పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ తన పేరు మార్చుకున్నా లేదా మరే ఇతర ఎత్తుగడలు వేసినా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం వినాశనానికి గురైందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా సింగరేణిలో జరిగిన అవినీతిని, అక్రమ ఒప్పందాలను అక్కడి కార్మికులు ఎప్పటికీ మర్చిపోలేరని.. ఆ పాపాలన్నీ గత ప్రభుత్వానివేనని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కుమ్మక్కై కలిసి పోటీ చేసినా, ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వస్తున్న విమర్శలకు కూడా ఆయన గట్టిగానే బదులిచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి నెలా సుమారు 7 వేల కోట్ల రూపాయల పాత అప్పులు చెల్లిస్తోందని.. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం వల్ల కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట నిజమేనని ఆయన అంగీకరించారు. ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పటికీ, ప్రజా సంక్షేమ పథకాలను ఆపకుండా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని ఆయన వివరించారు. రాజకీయ అనుభవం ఉన్న నాయకులు కూడా రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *