PM Modi

PM Modi: బెంగాల్ అభివృద్ధికి మోదీ ‘ఆరు’ సూత్రాలు.. ఆ హామీలు ఇవే!

PM Modi: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటనలు చేశారు. పూర్బా మేదినీపూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, బెంగాల్ ప్రజల భవిష్యత్తు కోసం ఆరు ప్రధాన హామీలను ప్రకటించారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు గరిష్ట ప్రయోజనాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్‌లో ప్రస్తుతం ఉన్న భయానక వాతావరణాన్ని తొలగించి, న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగిస్తామని ఆయన మొదటి హామీగా పేర్కొన్నారు.

అడ్మినిస్ట్రేషన్ విషయంలో భారీ మార్పులు చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం వస్తే పరిపాలన యంత్రాంగం పూర్తిగా ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని, అవినీతికి తావుండదని చెప్పారు. ముఖ్యంగా గత టీఎంసీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు, మహిళలపై జరిగిన దాడులు, అత్యాచారాల కేసుల ఫైళ్లను మళ్లీ తెరుస్తామని హెచ్చరించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా, మంత్రులైనా సరే చట్టం ముందు నిలబడాల్సిందేనని, ఏ ఒక్క టీఎంసీ గూండా కూడా తప్పించుకోలేరని మోడీ ఘాటుగా వ్యాఖ్యానించారు.

శరణార్థులు మరియు ఉద్యోగుల ప్రయోజనాల కోసం కూడా ప్రధాని కీలక హామీలిచ్చారు. శరణార్థులకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన అన్ని హక్కులు కల్పిస్తామని, అయితే దేశంలోకి అక్రమంగా చొరబడిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. అలాగే, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయాల వల్ల బెంగాల్ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బెంగాల్‌కు ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని దృష్టిలో ఉంచుకుని ‘బ్లూ ఎకానమీ’ (నీలి ఆర్థిక వ్యవస్థ) గురించి మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని, రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయించిందని గుర్తు చేశారు. మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే మత్స్య మరియు సముద్రపు ఆహార రంగాల్లో రాష్ట్రాన్ని స్వయం సమృద్ధిగా మారుస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కాగా, బెంగాల్‌లో రెండు విడతల్లో జరగనున్న పోలింగ్ ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *