Soil Health Volunteers: తెలంగాణ రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ‘సాయిల్ హెల్త్ వాలంటీర్ల’ (భూసార ఆరోగ్య వాలంటీర్లు) నియామకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారికంగా ప్రకటించారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురు వాలంటీర్ల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30,000 మందిని ప్రభుత్వం ఎంపిక చేయనుంది. ఈ ప్రక్రియకు సంబంధించి మొదటి విడత శిక్షణ కార్యక్రమం హైదరాబాద్లోని ఇక్రిశాట్ (ICRISAT) వేదికగా ప్రారంభమైంది.
వాలంటీర్లు చేసే పనులు ఇవే..
ఈ సాయిల్ హెల్త్ వాలంటీర్లు కేవలం ప్రభుత్వ పథకాలను వివరించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో రైతులకు సాంకేతిక సలహాదారులుగా వ్యవహరిస్తారు. వీరు ప్రధానంగా ఈ క్రింది అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు:
-
భూసార పరీక్షలు: మట్టి నాణ్యతను బట్టి ఏ పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుందో వివరిస్తారు.
-
పెట్టుబడి తగ్గింపు: అనవసరమైన రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే మార్గాలను చూపుతారు.
-
శిక్షణ: వీరికి ఇక్రిశాట్ మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా అత్యాధునిక సాగు పద్ధతులపై శిక్షణ ఇస్తాయి.
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎంపికైన వాలంటీర్లకు తొలి విడత శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ పూర్తయిన వెంటనే వీరు గ్రామాల్లో రైతులతో కలిసి పనిచేయడం ప్రారంభిస్తారు.
సేంద్రీయ ఎరువులపై అవగాహన
భూసార పరిరక్షణను ఒక సామాజిక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ముఖ్యంగా పంట కోసిన తర్వాత వ్యర్థాలను తగలబెట్టే అలవాటును మానుకోవాలని, వాటిని ఎరువుగా మార్చుకోవాలని రైతులకు సూచించారు. జీలుగు, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట ఎరువుల ద్వారా భూమికి సహజమైన బలాన్ని చేకూర్చవచ్చని ఆయన వివరించారు. భూమిలో రసాయనాలు తగ్గితేనే మనకు పౌష్టికాహారం అందుతుందని మంత్రి స్పష్టం చేశారు.
మే నెలలో రైతు ఉత్సవాలు
వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై రైతులకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం మే 4 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు ఉత్సవాలను’ నిర్వహించనుంది. ఈ ఉత్సవాల్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిల్ హెల్త్ కార్డులు, సాగు మెళకువలను తెలుసుకోవాలని ప్రభుత్వం కోరింది.
