Revanth Reddy

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్: ప్రధాని మోడీ, సీఎం విజయన్ ఇద్దరూ బ్రదర్సే!

Revanth Reddy: ప్రస్తుతం కేరళ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ పర్యటిస్తూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్, ప్రధాని మోదీ మధ్య ఉన్న సంబంధాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

కేరళ ప్రజలు మరియు యువత చాలా కష్టపడే స్వభావం గలవారని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల అభివృద్ధిలో కేరళ యువత కృషి ఎంతో ఉందని ఆయన కొనియాడారు. అయితే గతంలో ఊమెన్ చాండీ లాంటి నేతల హయాంలో కేరళ ఎంతగానో అభివృద్ధి చెందిందని, కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేరళలో ఉన్న కష్టాలకు యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ప్రభుత్వం వస్తేనే పరిష్కారం దొరుకుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాజకీయ విమర్శల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా పినరయి విజయన్‌ను టార్గెట్ చేశారు. పినరయి విజయన్ పాత వామపక్ష నాయకులను మరిచిపోయారని, ఆయన ప్రస్తుతం ఎన్డీయేకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. పినరయి విజయన్, ప్రధాని మోదీ ఇద్దరూ మంచి మిత్రులని, ఒకరు కేరళలో ఉంటే మరొకరు ఢిల్లీలో ఉంటూ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేరళలో మోదీ అడుగు పెట్టడానికి పినరయి విజయనే మార్గం సుగమం చేస్తున్నారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాజకీయాలను కేరళతో పోలుస్తూ రేవంత్ రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023 కంటే ముందు తెలంగాణలో కేసీఆర్ కూడా తనను ఎవరూ ఓడించలేరని అనుకున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మార్పు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అదే విధంగా కేరళలో కూడా పినరయి విజయన్ కోటను బద్దలు కొట్టి యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. పినరయి విజయన్ వ్యక్తిగతంగా గౌరవప్రదమైన వ్యక్తి అయినప్పటికీ, ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రాష్ట్రానికి నష్టకరమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *