Chandrababu Naidu

Chandrababu Naidu: అమరావతిని ఎవరూ తాకలేరు.. ఏపీకి ఏకైక రాజధాని ఇదే

Chandrababu Naidu: అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టడం ఒక చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన ‘ప్రజా వేదిక’ సభలో ఆయన ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో అమరావతిని ఎవరూ తాకలేరని, ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతి వెలుగుందుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ‘స్వర్ణాంధ్ర’గా మార్చేందుకు ఆరు సూత్రాల ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.

గత ఐదేళ్లలో రాష్ట్రంలో అరాచక పాలన సాగిందని, ‘మూడు రాజధానులు’ అనే నినాదంతో అమరావతిపై విషప్రచారం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే, ప్రతిపక్ష నేత జగన్ రాకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రజలందరూ ఆమోదించిన రాజధానిపై ఇంత కక్ష పెంచుకోవడం సరికాదని హితవు పలికారు. ఇకపై రాజధానిని అంగుళం కూడా కదిలించడం ఎవరి తరం కాదని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై కూడా చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీశైలం, పోలవరం నీళ్లను ఉదయగిరి ప్రాంతానికి కూడా అందిస్తామని చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ‘పి4’ (P4) విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా సుమారు 25 వేల కుటుంబాలను దత్తత తీసుకునేందుకు అదానీ గ్రూప్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.

నెల్లూరు జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే నౌకాశ్రయాలు ఉన్నాయని, త్వరలోనే విమానాశ్రయం కూడా వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని, ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇప్పించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. అలాగే రేషన్ బియ్యం విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులను, డీలర్లను హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *