Crime News: బెంగళూరు నగరంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటకు చెందిన సాఫ్ట్వేర్ దంపతులు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. భర్త ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక భార్య అపార్ట్మెంట్ పైనుంచి దూకి ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో అటు బెంగళూరులోని వారి నివాస ప్రాంతంలో, ఇటు సిద్దిపేటలోని వారి స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
మృతులను సిద్దిపేటకు చెందిన భాను చందర్ రెడ్డి (32), ఆయన భార్య బీబీ షాజియా సిరాజ్ (31)గా పోలీసులు గుర్తించారు. షాజియా ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం సాయంత్రం షాజియా ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి, గది లోపల నుండి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా భర్త పలకకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె, పొరుగువారి సహాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూసింది. అక్కడ తన భర్త ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
భర్త మరణాన్ని తట్టుకోలేకపోయిన షాజియా, క్షణాల వ్యవధిలోనే వారు నివసిస్తున్న అపార్ట్మెంట్ 17వ అంతస్తు నుండి కిందకు దూకింది. తీవ్ర గాయాలవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి మధ్య ఏవైనా గొడవలు ఉన్నాయా? లేదా ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి కారణమా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు పూర్తి వివరాల కోసం కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.
