Revanth Reddy

Revanth Reddy: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గర్జన.. మైనింగ్, భూ అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశం!

Revanth Reddy: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2014 నుండి రాష్ట్రంలో జరిగిన మైనింగ్ అక్రమాలు, భూ బదలాయింపులపై సీబీసీఐడీ (CBCID) విచారణకు ఆదేశించినట్లు ఆయన సభలో ప్రకటించారు. అధికారుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, దోషులెవరైనా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. సీఐడీ విచారణపై నమ్మకం లేకపోతే సీబీఐ విచారణకు కూడా తాము సిద్ధమని ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు.

మైనింగ్ అక్రమాలు – కేసీఆర్ కుటుంబంలో విభేదాలు

రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తో పాటు గత పదేళ్లుగా జరిగిన మైనింగ్ లావాదేవీలపై సమగ్ర విచారణ జరుపుతామని రేవంత్ రెడ్డి తెలిపారు.

సీఐడీ విచారణకు ఆదేశించిన తర్వాత కేసీఆర్ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ నిర్ణయాల వల్ల తాము ఇబ్బందుల్లో పడ్డామని హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావుల మధ్య తగాదాలు జరిగాయని ఎద్దేవా చేశారు.

ధరణిని అడ్డుపెట్టుకుని మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో వందల ఎకరాల భూమిని దోచుకున్నారని సీఎం ఆరోపించారు. హరీష్ రావు సోదరుడి భూ బదలాయింపులపై హౌస్ కమిటీ వేయడానికి తాము సిద్ధమని ప్రకటించారు.

బీఆర్‌ఎస్ డీఎన్ఏలోనే ఎస్సీ వ్యతిరేకత

దళిత సామాజిక వర్గాల పట్ల బీఆర్‌ఎస్ అనుసరిస్తున్న విధానాలను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు.

  1. మాట తప్పిన కేసీఆర్: తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా ఎస్సీని చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ తప్పారని విమర్శించారు. ఎస్సీలకు పరిపాలన చేతకాదని, దొరలే సీఎం కావాలని ఆయన భావించారని మండిపడ్డారు.

  2. రాజకీయ వివక్ష: స్పీకర్ స్థానంలో ఎస్సీ వ్యక్తి ఉండటం బీఆర్‌ఎస్ నేతలకు ఇష్టం లేదని, అందుకే పోడియం వద్ద నిరసన తెలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, సీతక్క వంటి వారికి తమ ప్రభుత్వం ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించిందని చెప్పారు.

గతాన్ని గుర్తుచేస్తే తలవంచుకోవాలి

2014లో టీడీపీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న చరిత్ర వారిదని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తమ గతాన్ని తలచుకుంటే బీఆర్‌ఎస్ సభ్యులు తలవంచుకుని సభ నుంచి వెళ్లిపోవాలని, కానీ తామే జాతి పితలమని బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. హౌస్ కమిటీ అనేది కేవలం నివేదిక మాత్రమే ఇస్తుందని, ఎవరినీ శిక్షించలేదని.. అందుకే తాము విచారణ సంస్థల ద్వారానే దోషులపై చర్యలు తీసుకోబోతున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *