Telangana

Telangana: సర్కార్ బడి పిల్లలకు పండగే.. మధ్యాహ్న భోజనంలో నోరూరించే సరికొత్త రుచులు!

Telangana: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, మధ్యాహ్న భోజన పథకంలో ఒక కీలక మార్పు చేయబోతోంది. ఇప్పటివరకు అందిస్తున్న సన్న బియ్యం, కోడిగుడ్లతో పాటు ఇకపై రుచికరమైన చేపల కూరను కూడా వడ్డించాలని నిర్ణయించింది. పిల్లల్లో పౌష్ఠికాహార లోపాన్ని నివారించి, వారిని ఆరోగ్యంగా ఉంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

పిల్లలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు:
సాధారణంగా చేపలు తినేటప్పుడు ముల్లులు గుచ్చుకుంటాయనే భయం ఉంటుంది. అందుకే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ‘తిలాపియా’ అనే ప్రత్యేక జాతి చేపలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చేపలను ప్రత్యేకంగా పెంచి, పాఠశాలలకు సరఫరా చేయనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ అంశంపై ఇప్పటికే క్యాబినెట్‌లో చర్చ జరిగిందని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో చేపల కూర అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం మరిన్ని అడుగులు:
తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వం, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేస్తోంది. ఇప్పటికే బడి పిల్లలకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందించే దిశగా అడుగులు వేస్తున్న సర్కార్, ఇప్పుడు భోజనంలో చేపలను చేర్చడం ద్వారా విద్యా శాఖలో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. కేవలం చదువు, ఆహారమే కాకుండా గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *