Earthquake: భారత్ పొరుగు దేశమైన నేపాల్‌లో గురువారం భూమి కంపించింది. మార్చి 26వ తేదీన సుదూర పశ్చిమ ప్రావిన్స్‌లోని దార్చులా జిల్లా మురై ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ కేంద్రం ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ భూకంప ప్రభావం కేవలం దార్చులా జిల్లాకే పరిమితం కాకుండా, పక్కనే ఉన్న బైతాడి, బఝాంగ్ జిల్లాల్లో కూడా కనిపించింది. భూమి అదిరిన వెంటనే అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. అయితే, ఈ ప్రకంపనల వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరిగినట్లు సమాచారం అందలేదు. అధికారులు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
నేపాల్ భౌగోళికంగా అత్యంత ప్రమాదకరమైన భూకంప జోన్‌లలో (జోన్ IV, V) ఉంది. దీనివల్ల ఈ హిమాలయ దేశంలో తరచుగా భూప్రకంపనలు సంభవిస్తూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా భూకంప ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో నేపాల్ 11వ స్థానంలో ఉండటం గమనార్హం. గతంలో 2015లో సంభవించిన 7.8 తీవ్రత కలిగిన భారీ భూకంపం సుమారు 9 వేల మందిని బలితీసుకున్న చేదు జ్ఞాపకాలు నేటికీ అక్కడి ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.
