Kavitha: తెలంగాణ రాజకీయాల్లో మరో పెను మార్పు రాబోతోంది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్సీ కవిత తాజాగా తన భవిష్యత్తు ప్రణాళికను వెల్లడించారు. త్వరలోనే తాను సొంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ పార్టీకి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, మంచి ముహూర్తం చూసుకుని పార్టీ పేరును, జెండాను ప్రకటిస్తానని ఆమె తెలిపారు. గాంధీజీ చెప్పిన ‘సర్వోదయ’ సిద్ధాంతమే తన పార్టీకి పునాది అని, అందరి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని కవిత పేర్కొన్నారు. ఇప్పటికే పార్టీ కార్యాలయం కోసం స్థలాన్ని వెతికే పనిలో ఉన్నట్లు ఆమె వివరించారు.
తన రాజకీయ పోరాటం ఎవరి మీదో కూడా కవిత సూటిగా చెప్పారు. “నా పోరాటం డాడీ (కేసీఆర్), మోడీ, మరియు చిన్న మోడీలపైనే” అని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తే లేదని, తన కొత్త పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీతో తనకు ఉన్న విభేదాలను కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. అసెంబ్లీలో కూడా తన వ్యక్తిగత విషయాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
శ్రీరామనవమి తర్వాత పార్టీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని కవిత వెల్లడించారు. అంతకంటే ముందే ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయి నాయకులను కలిసి మద్దతు కోరతానని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కష్టపడిన యువతకు తన పార్టీలో ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో తన పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆమె అంచనా వేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తనను పోటీ చేయమని ప్రజలు కోరుతున్నారని, ముఖ్యంగా వనపర్తి నుంచి పోటీ చేయాలని ఒత్తిడి వస్తోందని కవిత ఈ సందర్భంగా తెలియజేశారు.
