Hyderabad

Hyderabad: భాగ్యనగరంలో కల్తీ కలకలం.. హలీం నుంచి అల్లం వెల్లుల్లి వరకు అన్నీ విషతుల్యమే!

Hyderabad: హైదరాబాద్ అంటేనే రుచికరమైన బిర్యానీలు, నోరూరించే హలీంలకు పెట్టింది పేరు. కానీ, ప్రస్తుతం నగరంలో పరిస్థితి చూస్తుంటే ఏదైనా తినాలంటేనే సామాన్యులు హడలిపోతున్నారు. ఒకవైపు రంజాన్ సందడి కనిపిస్తుంటే, మరోవైపు కల్తీ ఆహార దందా విచ్చలవిడిగా సాగుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిచెన్లలో అపరిశుభ్రత, గడువు ముగిసిన పదార్థాలు వాడుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తుండటంతో, రంగంలోకి దిగిన పోలీసులు వరుస దాడులు చేస్తూ కల్తీ గుట్టు రట్టు చేస్తున్నారు.

ఎక్కడ చూసినా కల్తీయే..
ఇటీవల జరిగిన పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అంబర్‌పేటలో హానికరమైన కెమికల్స్ ఉపయోగించి తయారు చేస్తున్న 250 కిలోల కల్తీ పెరుగును పోలీసులు సీజ్ చేశారు. అలాగే మైలార్‌దేవ్‌పల్లిలో నాసిరకం పదార్థాలతో స్వీట్లు తయారు చేస్తున్న ఒక యూనిట్‌పై దాడి చేశారు. మంగళహాట్‌లో ఏకంగా 300 కిలోల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, ఢిల్లీ నుంచి పాత మాంసాన్ని తెప్పించి, ఫ్రిజ్‌లలో పెట్టి స్థానిక హోటళ్లకు, బార్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి ఆహారం తింటే ప్రాణాపాయం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అల్లం-వెల్లుల్లి పేస్టులోనూ మోసం..
మరోవైపు, టప్పాచబుత్రలో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న కేంద్రం బయటపడింది. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో, ఈగలు ముసురుతున్న చోట ప్లాస్టిక్ డబ్బాల్లో ఈ పేస్ట్‌ను నిల్వ చేస్తున్నారు. దీనికి ఉప్పు, సిట్రిక్ యాసిడ్ వంటి రసాయనాలు కలిపి రంగు మార్చి మార్కెట్లోకి పంపిస్తున్నారు. ఇది నేరుగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేస్తున్నప్పటికీ, గతంలో జరిమానాతో తప్పించుకున్న వారు మళ్ళీ ఇదే దందాను కొనసాగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం..
రంజాన్ సీజన్‌లో హలీం తయారీ కేంద్రాలపై కఠినమైన పర్యవేక్షణ ఉండాలని ప్రజలు కోరుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీస్ శాఖ కలిసి పని చేయకపోవడం వల్ల కల్తీ వ్యాపారులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కేవలం పోలీసులు మాత్రమే దాడులు చేయడం కాకుండా, ఆహార భద్రత అధికారులు నిత్యం తనిఖీలు చేస్తేనే ఇలాంటి దందాలకు అడ్డుకట్ట పడుతుంది. బయట ఆహారం తినేటప్పుడు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, నాణ్యతను గమనించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *