Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు చల్లని కబురు అందించాడు. అయితే, కేవలం చిరుజల్లులే కాకుండా కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా బుధవారం రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంది..
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచనలు చేసింది. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ముఖ్యంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వానతో పాటు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
హైదరాబాద్లో వానల జోరు..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం మొదలైంది. రాబోయే గంటల్లో శంషాబాద్, రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, చార్మినార్, వనస్థలిపురం, చంద్రాయణగుట్ట వంటి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట వంటి చోట్ల వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండటం మంచిది.
ఆంధ్రప్రదేశ్లో పిడుగుల హెచ్చరిక..
ఏపీలోని పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లా, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల వల్ల కోస్తా జిల్లాల్లో ఎండ వేడి కొంచెం తగ్గి, ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ ఉండకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలకు కొన్ని ముఖ్య సూచనలు..
భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్న సమయంలో విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకూడదు. పాత గోడలు, పెద్ద పెద్ద హోర్డింగ్లు, చెట్లు పడిపోయే ప్రమాదం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు, కూలీలు పొలాల్లో ఉన్నప్పుడు పిడుగుల పట్ల జాగ్రత్త వహించాలి. రాబోయే కొద్ది రోజులు ప్రయాణాలు చేసే వారు వాతావరణ పరిస్థితులను గమనించుకుని బయటకు వెళ్లడం ఉత్తమం.
