Telangana: హనుమకొండ జిల్లా కడిపికొండ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్నకూతురు, తండ్రి ఇంట్లో నిద్రిస్తుండగానే సజీవ దహనమయ్యారు. అయితే, ఇది ప్రమాదం అనుకుంటే పొరపాటే. కట్టుకున్న భార్యను, కంటికి రెప్పలా చూసుకున్న మామను అల్లుడే అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అందరికీ ఇది ప్రమాదం అని నమ్మించాలని చూసినా, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.
అసలేం జరిగింది?
చింతల్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌కు, రాజశ్రీకి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, ప్రవీణ్ ఎలాంటి పనిపాట లేకుండా తిరుగుతుండటంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే రాజశ్రీ తండ్రి రాజశేఖర్ తన కూతురి ఇంటికి వచ్చి, బాధ్యత లేకుండా తిరుగుతున్న అల్లుడు ప్రవీణ్‌ను గట్టిగా మందలించారు. తనను అందరిలో తక్కువ చేసి మాట్లాడారనే కక్షను ప్రవీణ్ మనసులో పెంచుకున్నాడు.
పథకం ప్రకారం హత్య..
మామపై ఉన్న కోపంతో ప్రవీణ్ ఒక కిరాతకమైన ప్లాన్ వేశాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో, భార్య రాజశ్రీపై, మామ రాజశేఖర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో చిక్కుకున్న ఆ ఇద్దరూ చూస్తుండగానే సజీవ దహనమయ్యారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా, తన భార్య, మామ ప్రమాదవశాత్తు చనిపోయారంటూ బంధువులకు ఫోన్లు చేసి నమ్మించే ప్రయత్నం చేశాడు. ప్రవీణ్ మాటలు విని కంగారుగా వచ్చిన బంధువులు, ఘటనా స్థలాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.
పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు..
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మృతదేహాలను పరిశీలించి, అనుమానాస్పద స్థితిలో కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో ప్రవీణ్ ప్రవర్తనపై అనుమానం కలగడంతో అతడిని తమదైన శైలిలో విచారించారు. చివరకు కుటుంబ కలహాల వల్లే తనే పెట్రోల్ పోసి చంపేశానని ప్రవీణ్ ఒప్పుకున్నాడు. ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలనుకున్న నిందితుడు చివరకు కటకటాల పాలయ్యాడు. ఒకే ఇంట్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
