Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ విద్యార్థులు ఆహారాన్ని డస్ట్‌బిన్‌లో పారబోసిన ఘటన సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. స్కూల్‌కు వెళ్లడమే కాకుండా, విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి దాని నాణ్యతను పరిశీలించారు.
తనిఖీ సందర్భంగా మంత్రి విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తూనే, భోజనం నాణ్యతపై ఆరా తీశారు. “గతంలో భోజనం ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది?” అని అడిగి తెలుసుకున్నారు. కొత్త కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం బాగుందని విద్యార్థులు చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. భోజనం ఏమాత్రం బాగాలేకపోయినా వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలని పిల్లలకు సూచించారు. అలాగే, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు లీప్ యాప్ (LEAP App) ను వాడుతామని, తప్పులు జరిగితే అస్సలు సహించబోమని స్పష్టం చేశారు.
పాఠశాల సిబ్బందిపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పెట్టే ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని, అది మీ పవిత్ర బాధ్యత అని గుర్తుచేశారు. భోజనం సిద్ధమైన తర్వాత ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడు దాన్ని రుచి చూసి, నాణ్యంగా ఉందని నిర్ధారించుకున్నాకే పిల్లలకు వడ్డించాలని ఆదేశించారు. భోజనం నాణ్యతపై ప్రతివారం తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చదువుతో పాటు పిల్లల ఆరోగ్యం కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, ప్రతి ఎమ్మెల్యే వారానికి ఒకరోజు తమ నియోజకవర్గంలోని ఏదో ఒక పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని నిర్ణయించారు. స్కూల్ ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించిన మంత్రి, అక్కడి పరిశుభ్రతను చూసి సిబ్బందిని అభినందించారు.
