Harish Rao: తెలంగాణలో కొత్తగా చేపడుతున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ ప్రాజెక్టుల పేరుతో సుమారు రూ. 18 వేల కోట్ల స్కామ్ జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజా ధనాన్ని పక్కదారి పట్టిస్తోందని ఆయన విమర్శించారు.
సాధారణంగా ఇలాంటి పనులకు ఇచ్చే అడ్వాన్సుల విషయంలో ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ రోడ్ల నిర్మాణానికి ముందస్తుగా 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ కమీషన్ల ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయలను ఇతర రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలని చూస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రభుత్వానికి నిజంగా రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే, వెంటనే ఈ టెండర్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, మొబిలైజేషన్ అడ్వాన్సులను పూర్తిగా రద్దు చేయాలని సూచించారు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తేనే నిజాలు బయటకు వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ అవినీతిపై కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా.. సీవీసీ (CVC), ఆర్బీఐ (RBI) వంటి కేంద్ర సంస్థలకు కూడా ఫిర్యాదు చేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న తప్పులకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ స్కామ్‌కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
