Pakistan: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌పై పాకిస్థాన్ వైమానిక దళం సోమవారం అర్ధరాత్రి దాడికి దిగింది. ఈ ఘటనలో 400 మందికి పైగా మరణించగా, మరో 250 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆఫ్ఘన్ అధికారులు మంగళవారం (మార్చి 17) ఉదయం వెల్లడించారు. మాదకద్రవ్యాల వ్యసనం నుంచి విముక్తి పొందేందుకు చికిత్స అందిస్తున్న ఒక భారీ రిహాబిటేషన్ ఆస్పత్రి (Omid Addiction Treatment Hospital) లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆరోపించింది.
మృతుల్లో రోగులే ఎక్కువ
ఆఫ్ఘనిస్థాన్ డిప్యూటీ ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో పాక్ యుద్ధ విమానాలు ఆస్పత్రిపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఆస్పత్రి 2,000 పడకల సామర్థ్యం కలది. దాడి సమయంలో వందలాది మంది రోగులు నిద్రిస్తుండగా ఒక్కసారిగా భవనంలోని చాలా భాగాలు కుప్పకూలాయి.
తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. “చికిత్స పొందుతున్న నిస్సహాయులపై దాడులు చేయడం అమానుషం. ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమైన నేరం” అని ఆయన మండిపడ్డారు. మంటలను అదుపు చేసేందుకు, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయక బృందాలు ఇప్పటికీ కృషి చేస్తున్నాయి.
పాకిస్థాన్ వాదన వేరు
ఆఫ్ఘన్ ఆరోపణలను పాకిస్థాన్ ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. తాము పౌర స్థావరాలను గానీ, ఆస్పత్రులను గానీ లక్ష్యంగా చేసుకోలేదని పాక్ స్పష్టం చేసింది. సరిహద్దులో ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న సైనిక స్థావరాలు మరియు మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాలపైనే ‘ఖచ్చితమైన దాడులు’ (Precision Strikes) నిర్వహించామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతినిధి తెలిపారు. ఉగ్రవాదులకు తాలిబన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని పాక్ ఆరోపించింది.
డ్యూరాండ్ లైన్ వద్ద యుద్ధ వాతావరణం
గత కొన్ని వారాలుగా రెండు దేశాల సరిహద్దు అయిన ‘డ్యూరాండ్ లైన్’ వద్ద ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ వైమానిక దాడులకు కొన్ని గంటల ముందే ఖోస్ట్ ప్రావిన్స్‌లో పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ఆఫ్ఘన్లు మరణించారు. సరిహద్దు గొడవలు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య బహిరంగ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఈ పౌర మరణాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
