SCB Hospital Fire Accident: ఒడిశాలోని ప్రతిష్టాత్మకమైన ఎస్సీబీ (SCB) మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో సోమవారం (మార్చి 16) తెల్లవారుజామున పెను ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని ట్రామా కేర్ ఐసీయూ (ICU) విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చికిత్స పొందుతున్న 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటనతో ఆసుపత్రి ప్రాంగణమంతా ఆర్తనాదాలతో నిండిపోయింది.
అర్ధరాత్రి వేళ మొదలైన మంటలు
స్థానిక సమాచారం ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున సుమారు 2:30 నుండి 3:00 గంటల మధ్య ట్రామా కేర్ అత్యవసర విభాగంలోని మొదటి అంతస్తులో మంటలు ప్రారంభమయ్యాయి. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఐసీయూలో వెంటిలేటర్లపై ఉన్న రోగులు ఊపిరాడక, బయటకు రాలేక అక్కడికక్కడే మరణించారు. ప్రమాద సమయంలో ఐసీయూలో సుమారు 23 మంది రోగులు ఉన్నట్లు తెలుస్తోంది.
మంటలను గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు 11 మంది ఆసుపత్రి సిబ్బంది కూడా రోగులను కాపాడే ప్రయత్నంలో గాయపడ్డారు.
సీఎం మోహన్‌చరణ్ పరామర్శ.. భారీ ఎక్స్‌గ్రేషియా
ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝీ హుటాహుటిన కటక్ చేరుకున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున భారీ ఆర్థిక సహాయాన్ని (ఎక్స్‌గ్రేషియా) ప్రకటించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన సీఎం, ఈ ఘోర ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతుండగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భయాందోళనలో బాధితులు
ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో తీవ్ర గందరగోళం నెలకొంది. తమ వారిని కాపాడుకోవడానికి రోగుల బంధువులు దిక్కుతోచని స్థితిలో పరుగులు తీశారు. ప్రస్తుతం ఐసీయూలోని మిగిలిన రోగులను సురక్షితంగా వేరే వార్డులకు తరలించారు. ఆసుపత్రిలో భద్రతా ప్రమాణాల పాటించడంలో వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
