PM Kisan

PM Kisan: పీఎం కిసాన్ నిధులు విడుదల.. మీ ఖాతాలో రూ. 2 వేలు పడలేదా? అయితే వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి!

PM Kisan: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 13న అస్సాంలోని గువహతిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పీఎం కిసాన్ (PM-Kisan) 22వ విడత నిధులను విడుదల చేశారు. ఈ విడతలో భాగంగా కేంద్రం మొత్తం రూ. 18,640 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. దీనివల్ల దేశంలోని సుమారు 9 కోట్ల 32 లక్షల మంది రైతులకు రూ. 2,000 చొప్పున ఆర్థిక సాయం అందింది.

లబ్ధిదారుల జాబితాలో పేరున్నా డబ్బులు రాలేదా?

చాలా మంది రైతులు తాము అర్హులమేనని, జాబితాలో పేరు ఉందని చెబుతున్నా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల వారి ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. ఒకవేళ మీకు కూడా నిధులు అందకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.

ఈ నంబర్లకు కాల్ చేయండి: రైతులు నేరుగా కింది టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి తమ సమస్యను వివరించవచ్చు:

  • 155261

  • 1800115526

  • 011-23381092 (ల్యాండ్ లైన్)

  • ఒకవేళ మీరు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలనుకుంటే pmkisan-ict@gov.in కి మీ వివరాలను పంపవచ్చు. మీ అకౌంట్లో నిధులు ఎందుకు జమ కాలేదో అధికారులు మీకు సమాచారం అందిస్తారు.

నిధులు నిలిచిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే..

పీఎం కిసాన్ డబ్బులు ఆగిపోవడానికి ఎక్కువగా కింది కారణాలు ఉంటున్నాయి:

  1. ఈ-కేవైసీ (e-KYC): ప్రతి రైతు ఏడాదికి ఒకసారి పీఎం కిసాన్ పోర్టల్‌లో ఈ-కేవైసీ అప్డేట్ చేయడం తప్పనిసరి. ఇది చేయని వారి నిధులు నిలిచిపోతాయి.

  2. ఆధార్ లింకింగ్: మీ బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డు లింక్ కాకపోయినా లేదా ఆధార్‌లోని పేరు, బ్యాంక్ రికార్డుల్లోని పేరు వేరుగా ఉన్నా డబ్బులు పడవు.

  3. భూమి రికార్డులు: ల్యాండ్ సీడింగ్ (Land Seeding) ప్రక్రియ పూర్తి కాకపోయినా లేదా రెవెన్యూ రికార్డుల్లో తప్పులు ఉన్నా నిధులు ఆగిపోతాయి.

పథకం గురించి కొన్ని ముఖ్య విషయాలు

ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాల లోపు పొలం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఏటా రూ. 6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. దీనిని ఏడాదికి మూడు విడతలుగా (రూ. 2,000 చొప్పున) నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా కేంద్రం మొత్తం రూ. 4.09 లక్షల కోట్లను పంపిణీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టేవారు మరియు పెద్ద రైతులు ఈ పథకానికి అనర్హులు. ఒకవేళ మీరు ఇంకా ఈ పథకంలో చేరకపోతే పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *