Pawan Kalyan: గిరిజన ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి తాను తట్టుకోలేకపోయానని, వారి కష్టాలను తీర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అల్లూరి జిల్లా నందిగరువులో నిర్వహించిన ‘గిరిజనులతో మాటామంతీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి కూర్చుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సరైన రహదారులు లేక, కనీస సౌకర్యాలు అందక గిరిజనులు పడుతున్న వేదన తనను ఎంతగానో కలిచివేసిందని, అందుకే రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన వివరించారు.
గత ప్రభుత్వం గిరిజనుల గోడును కనీసం వినే ప్రయత్నం కూడా చేయలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజల కష్టాలను తీర్చడానికే పని చేస్తోందని, ఎవరికి ఏ సమస్య ఉన్నా ధైర్యంగా తనతో పంచుకోవచ్చని భరోసా ఇచ్చారు. అంతకుముందు ఓనూరు గ్రామంలో పర్యటించిన ఆయన, జల జీవన్ మిషన్ ద్వారా అందుతున్న మంచినీటి సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి చిన్నపిల్లలతో సరదాగా ముచ్చటించారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడంతో పాటు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేసి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
