Kamareddy: కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన ఒక దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గతంలో వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాలో తండ్రే కూతురికి ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చే సీన్ మనందరికీ గుర్తే ఉంటుంది. సరిగ్గా అదే తరహాలో, ఒక యువకుడు తాను పెళ్లి చేసుకోవాలనుకున్న యువతిపై పగతో ఎయిడ్స్ రక్తాన్ని శరీరంలోకి ఎక్కించిన కిరాతకానికి ఒడిగట్టాడు. ప్రేమ, పెళ్లి పేరుతో సామాన్య ప్రజలు ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉన్నారో ఈ ఘటన అద్దం పడుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడికి, ఒక యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే, సదరు యువకుడికి మరియు అతని తల్లిదండ్రులకు గతంలోనే ఎయిడ్స్ (HIV) వ్యాధి ఉందని యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది. ప్రాణాంతకమైన వ్యాధి ఉన్న వ్యక్తితో జీవితం పంచుకోవడం ఇష్టం లేక ఆ యువతి పెళ్లికి నిరాకరించింది. తనను కాదన్నదనే కోపంతో రగిలిపోయిన మనోహర్, ఎలాగైనా ఆమెను దెబ్బతీయాలని ఒక భయంకరమైన ప్లాన్ వేశాడు.
ఈ నెల 11వ తేదీన యువతి ఇంటికి వెళ్లిన మనోహర్, తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. ఆమె మొండిగా నిరాకరించడంతో, తన వెంట తెచ్చుకున్న ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడి రక్తం నింపిన ఇంజెక్షన్‌ను ఆమె శరీరంలోకి బలవంతంగా ఎక్కించాడు. యువతి హాహాకారాలు చేయడంతో స్థానికులు అలర్ట్ అయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
