LPG Bookings

LPG Bookings: గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌పై కేంద్రం విజ్ఞప్తి.. కారణం ఏంటంటే?

LPG Bookings: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల దేశంలో ఇంధన కొరత ఏర్పడుతుందని వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతం మన దేశంలో ఎల్పీజీ (LPG) గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. గతంతో పోలిస్తే దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి 30 శాతం పెరిగిందని, కాబట్టి నిల్వలు నిండుకుంటాయనే భయంతో ముందస్తుగా బుకింగ్‌లు చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సాధారణ రోజుల్లో రోజుకు 55.7 లక్షల సిలిండర్లు బుక్ అయ్యేవని, కానీ యుద్ధ భయాల వల్ల ఇప్పుడు ఆ సంఖ్య ఒక్కసారిగా 75.7 లక్షలకు చేరిందని ప్రభుత్వం వెల్లడించింది. కేవలం వదంతుల వల్లే ప్రజలు అవసరం లేకపోయినా సిలిండర్లను బుక్ చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల మార్కెట్‌లో అనవసరమైన డిమాండ్ ఏర్పడుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 25 వేల మంది డిస్ట్రిబ్యూటర్ల వద్ద గ్యాస్ నిల్వలు నిండుగా ఉన్నాయని, ఎక్కడా కొరత అనే మాట వినిపించడం లేదని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.

కేవలం గ్యాస్ మాత్రమే కాకుండా పెట్రోల్, డీజిల్ విషయంలో కూడా మన దేశం స్వయం సమృద్ధి సాధించిందని కేంద్రం తెలిపింది. మన దగ్గర ఉన్న రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, కాబట్టి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో ఉందని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది. వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ వాడే వారు వీలైతే పైపుడ్ గ్యాస్ (PNG) కనెక్షన్ తీసుకోవాలని ప్రభుత్వం సలహా ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *