LPG Crisis: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో కీలక వివరణ ఇచ్చింది. భారత దేశంలో పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ కొరత ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. ముఖ్యంగా గృహ అవసరాలకు వాడే గ్యాస్ విషయంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందని ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో కమర్షియల్ గ్యాస్‌ను అక్రమంగా నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పాఠశాలలు, ఆసుపత్రులకు ఇంధన సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూస్తున్నామని, ఇతర దేశాలతో పోలిస్తే చమురు నిల్వల విషయంలో భారత్ చాలా సురక్షితమైన స్థితిలో ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం మన దేశానికి అవసరమైన ఎల్పీజీలో 60 శాతం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి అవుతోంది. అయితే భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండటానికి గల్ఫ్ దేశాలపైనే కాకుండా నార్వే, కెనడా వంటి దేశాల నుంచి కూడా చమురు దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు మంత్రి వివరించారు. దేశంలోని అన్ని చమురు రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని ఆయన తెలిపారు. గతంలో హార్ముజ్ జలసంధి ద్వారానే ఎక్కువ దిగుమతులు జరిగేవని, కానీ ఇప్పుడు ఇతర మార్గాల ద్వారా ముడి చమురు దిగుమతులు 70 శాతానికి పెరిగాయని చెప్పారు. 2006-07 కాలంలో భారత్ కేవలం 27 దేశాల నుంచే చమురు కొనుగోలు చేసేదని, ఇప్పుడు ఆ సంఖ్య 40 దేశాలకు పెరిగిందని ఆయన సభకు వివరించారు.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ఇంధన రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు గతంలో ఎన్నడూ లేవని మంత్రి అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ భారత దేశపు ముడి చమురు నిల్వలు భద్రంగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యుద్ధం వంటి సంక్షోభ సమయంలో కూడా ప్రధానమంత్రి మోదీ దౌత్య నీతి వల్ల ఇరాన్ ప్రభుత్వం హార్ముజ్ జలసంధి ద్వారా భారత చమురు రవాణాకు అనుమతి ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. దీనివల్ల మన దేశానికి ఇంధన సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు.
