Chandrababu Naidu

Chandrababu Naidu: పనితీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవు.. అధికారులకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్!

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రెండో రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యంగా మంత్రులు, జిల్లా కలెక్టర్ల పనితీరు, ప్రజలతో వారు వ్యవహరించే తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పరిపాలనలో పాత పద్ధతులు ఇకపై సాగవని, ప్రజల పట్ల అధికారుల ఆటిట్యూడ్ (వైఖరి) కచ్చితంగా మారాలని ఆయన గట్టిగా హెచ్చరించారు.

ప్రజలు లేదా పెట్టుబడిదారులు తమ సమస్యల మీద కార్యాలయాలకు వచ్చినప్పుడు అధికారుల నుంచి నిర్లక్ష్యపు సమాధానాలు రాకూడదని సీఎం స్పష్టం చేశారు. “మాకు టైం లేదు.. బయట వెయిట్ చేయండి.. తర్వాత చూద్దాం” అనే మాటలు ఇక వినిపించకూడదని ఆయన సూచించారు. ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే వారికి గౌరవం ఇవ్వాలని, వారికి సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు చాలా కీలకమని, ఇన్వెస్టర్లను సాదరంగా ఆహ్వానించి వారికి అవసరమైన సాయం అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే అతిపెద్ద ఆస్తి అని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో ఉన్న మార్కెటింగ్ అవకాశాలను గుర్తించి, రైతన్నకు మేలు జరిగేలా చూడాలని కోరారు. వ్యవసాయానికి అవకాశం లేని ప్రాంతాల్లో పర్యాటక రంగం మరియు చిన్న తరహా పరిశ్రమల (MSME) పై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాల వారీగా ఉన్న వనరులను బట్టి కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని, అప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుంటుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

చివరగా, రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని, కేవలం ఫైళ్లకే పరిమితం కాకుండా ప్రజల మధ్య ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సమావేశం ద్వారా చంద్రబాబు ఒక బలమైన సందేశాన్ని పంపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *