Hyderabad: మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు హైదరాబాద్‌లోని హాస్టల్స్ వరకు చేరింది. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనివల్ల హైదరాబాద్‌లోని కమర్షియల్ గ్యాస్ సరఫరా తగ్గడంతో హాస్టల్ నిర్వాహకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని హాస్టల్స్‌లో గ్యాస్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది.
నగరంలో దాదాపు 11 వేల హాస్టల్స్ ఉన్నాయి, వీటిలో లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు నివసిస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో వంట చేయడం కష్టంగా మారిందని హాస్టల్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. విద్యా సంస్థలు, ఆసుపత్రులకు సంబంధించిన హాస్టల్స్‌కు గ్యాస్ అందుతున్నప్పటికీ, ప్రైవేట్ హాస్టల్స్‌కు మాత్రం సరఫరా నిలిచిపోయినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులతో మాట్లాడినా సరైన స్పందన రావడం లేదని వారు పేర్కొన్నారు.
ఈ గ్యాస్ కొరత కారణంగా హాస్టల్స్‌లో ఆహార పదార్థాల సంఖ్యను తగ్గిస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే చపాతీలు, దోశల వంటి ఐటమ్స్‌ను మెనూ నుంచి తొలగిస్తున్నట్లు యాజమాన్యాలు వెల్లడించాయి. కమర్షియల్ గ్యాస్ ఇవ్వలేకపోతే, కనీసం రోజుకు ఒక డొమెస్టిక్ సిలిండర్ అయినా కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్యాస్ కష్టాలు తీరకపోతే భవిష్యత్తులో హాస్టల్స్ నిర్వహణ మరింత భారంగా మారే అవకాశం ఉంది.
