Gas Crisis

Gas Crisis: గ్యాస్ కష్టాలు.. హైదరాబాద్‌లో హోటళ్లు బంద్‌? సామాన్యుడిపై యుద్ధ ప్రభావం!

Gas Crisis: దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడటంతో, దీని ప్రభావం నేరుగా మన వంటిళ్లపై, హోటళ్లపై పడుతోంది. ముఖ్యంగా భాగ్యనగరంలో పరిస్థితి దారుణంగా మారింది. గ్యాస్ దొరక్కపోవడంతో ఇప్పటికే నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. దీనిపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసరంగా సమావేశమై, ప్రస్తుత పరిస్థితుల్లో హోటళ్లను నడపడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది.

హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, భోపాల్, లక్నో వంటి ప్రధాన నగరాల్లో కూడా గ్యాస్ ఏజెన్సీల ముందు ప్రజలు క్యూ కడుతున్నారు. లక్నోలో వారం రోజులుగా సిలిండర్లు సరఫరా కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బెంగళూరులో ఎంతో పేరుగాంచిన విద్యార్థి భవన్ వంటి పాత రెస్టారెంట్లు కూడా మూసివేసే దశకు చేరుకున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్యాస్ కొరత వల్ల హోటళ్లలో టిఫిన్లు, భోజనాల తయారీ నిలిచిపోవడంతో సామాన్యులు బయట తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.

ఈ గ్యాస్ సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ, ఆ ప్రభావం దేశంలోని సామాన్య ప్రజలపై పడకుండా చూడాలని ఆయన కోరారు. గ్యాస్ సరఫరాను పునరుద్ధరించేందుకు అన్ని శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు. సరఫరాను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

అయితే, ఇదే సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల పట్ల ప్రభుత్వం హెచ్చరించింది. గ్యాస్ సిలిండర్ల కొరత గురించి తప్పుడు వార్తలు నమ్మి భయాందోళనతో స్టాక్ పెట్టుకోవద్దని కోరింది. త్వరలోనే సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని కేంద్రం చెబుతోంది. ఏది ఏమైనా, గ్యాస్ కొరత సామాన్యుడి జేబుకు, కడుపుకు చిల్లు పెడుతుండటంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *