Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంట గ్యాస్ (LPG) కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏమాత్రం లేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇళ్లలో వాడుకునే గ్యాస్ సిలిండర్లతో పాటు, హోటళ్లు వంటి వాణిజ్య అవసరాలకు కూడా సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని ఆయన భరోసా ఇచ్చారు.
గ్యాస్ పంపిణీలో ఎక్కడా అక్రమాలు జరగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాల వారీగా జాయింట్ కలెక్టర్లు ఈ విషయంపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.
కొంతమంది కావాలనే గ్యాస్ కొరత ఉందంటూ పుకార్లు పుట్టిస్తున్నారని, అలాంటి వారి మాటలు నమ్మవద్దని మంత్రి కోరారు. ఎవరైనా ఇష్టానుసారంగా ధరలు పెంచినా లేదా తప్పుడు వార్తలు ప్రచారం చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా గృహ అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, నిల్వల విషయంలో ఎలాంటి తేడా వచ్చినా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
