LPG Gas: ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో మన దేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. ఈ గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించింది. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌లతో కలిసి ప్రధాని సమీక్ష జరిపారు. గ్యాస్ కొరత రాకుండా చూడాలని, దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని 10 శాతం పెంచాలని కంపెనీలను ప్రధాని ఆదేశించారు.
వంట గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్లో అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రధాని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం, ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత 25 రోజులు గడిస్తేనే రెండో సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు గ్యాస్ అందేలా చూడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ఆయిల్ కంపెనీలు నిలిపివేయడంతో హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముంబైలో ఇప్పటికే 20 శాతం హోటళ్లు మూతపడ్డాయి. గ్యాస్ సరఫరా మెరుగుపడకపోతే మరో రెండు రోజుల్లో సగం హోటళ్లు మూతపడే అవకాశం ఉందని హోటల్ యజమానుల సంఘం హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఉన్న నిల్వలతోనే అతి కష్టంగా హోటళ్లు నడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరులో కూడా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కమర్షియల్ సిలిండర్లు దొరక్కపోవడంతో నగరంలోని అనేక హోటళ్లు ఇవాల్టి నుంచే తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఇదే పరిస్థితి కొనసాగితే దేశవ్యాప్తంగా వేలాది హోటళ్లు మూతపడే ప్రమాదం ఉంది. దీనివల్ల సామాన్య ప్రజల ఆహార అవసరాలపైనే కాకుండా, హోటల్ రంగంలో పనిచేసే వేలాది మంది ఉపాధిపై కూడా దెబ్బపడే అవకాశం కనిపిస్తోంది.
