Sangareddy: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని అశోక్ నగర్‌లో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు, వినాయకుడి విగ్రహానికి ఉన్న విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇందులో సుమారు 6 తులాల బంగారం, 8 కిలోల వెండి వస్తువులతో పాటు ఆలయానికి సంబంధించిన 90 వేల రూపాయల నగదు ఉన్నట్లు సమాచారం.
ఉదయం ఆలయానికి వచ్చిన పూజారులు, కమిటీ సభ్యులు చోరీ జరిగిన విషయాన్ని గమనించి షాక్‌కు గురయ్యారు. వెంటనే వారు రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆధారాల కోసం క్లూస్ టీమ్ కూడా ఆలయంలో వేలిముద్రలను సేకరించింది.
పవిత్రమైన ఆలయంలో ఇలాంటి ఘోరం జరగడంతో స్థానిక భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తూ, దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
