Vijayawada: అక్షరాలు దిద్దించి, అమ్మానాన్నల తర్వాత అంతటి ప్రేమను పంచాల్సిన గురువే ఆ పసిపాప పాలిట కాలయముడు అయ్యింది. విజయవాడ విద్యాధరపురంలోని ‘నేషనల్ ప్లే స్కూల్’లో జరిగిన ఈ దారుణ ఘటన సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. కేవలం మూడు సంవత్సరాల వయసున్న చిన్నారిపై ఒక స్కూల్ టీచర్ యాసిడ్ పోయడం, ఆపై యాజమాన్యం ఆ నిజాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించడం ఇప్పుడు నగరంలో పెద్ద కలకలం రేపుతోంది.
అసలేం జరిగింది?
గత నెల ఫిబ్రవరి 23న ఒక తల్లి తన కూతురిని ఎప్పటిలాగే స్కూల్‌లో వదిలి వెళ్లారు. అయితే, కొద్దిసేపటికే స్కూల్ నుండి ఆ తల్లికి ఫోన్ వచ్చింది. “మీ పాప బాత్‌రూమ్‌లో పడిపోయింది, చిన్న గాయాలయ్యాయి” అని టీచర్ చెప్పారు. కంగారుగా స్కూల్‌కు వెళ్లిన తల్లి, నొప్పితో విలవిలలాడుతున్న బిడ్డను చూసి తల్లడిల్లిపోయి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ వైద్యులు పరీక్షించగా, ఆ గాయాలు పడిపోవడం వల్ల వచ్చినవి కావని, అవి యాసిడ్ వల్ల కలిగిన కాలిన గాయాలని తేలడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.
నిజాన్ని దాచి.. బెదిరింపులకు దిగి..
వైద్యుల మాటలతో తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయగా, మొదట బుకాయించిన టీచర్ ఆ తర్వాత ఒప్పుకున్నారు. అయితే, ఇక్కడే స్కూల్ యాజమాన్యం తన అసలు రూపాన్ని బయటపెట్టింది. ఆసుపత్రి ఖర్చులు కడతామని, కొంత డబ్బు ఇచ్చి సెటిల్ చేసుకుందామని ఆ తల్లిదండ్రులకు ఆశ చూపారు. దానికి వారు ఒప్పుకోకపోవడంతో, స్కూల్ ప్రిన్సిపాల్ బెదిరింపులకు దిగారు. నగర డీసీపీ మాకు బంధువని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బాధితులనే భయపెట్టడం వారి అహంకారానికి పరాకాష్టగా నిలిచింది.
న్యాయం కోసం ఆవేదన
కళ్లముందే పసిపాప నరకయాతన అనుభవిస్తుంటే, జాలి చూపాల్సింది పోయి అధికార బలంతో బెదిరిస్తున్న వారిపై స్థానికులు మండిపడుతున్నారు. తప్పు చేసిన టీచర్‌ను, దాన్ని కప్పిపుచ్చడానికి చూసిన ప్రిన్సిపాల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారులను స్కూల్‌కు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడేలా చేస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
