Bomb Threat

Bomb Threat: హైదరాబాద్ వాతావరణ కేంద్రానికి బాంబు బెదిరింపు.. భయాందోళనలో ఉద్యోగులు

Bomb Threat: హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆఫీసులో ఏకంగా 14 ఆర్డీఎక్స్ (RDX) బాంబులు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్ రావడంతో అక్కడి సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణభయంతో ఉద్యోగులందరూ కార్యాలయం నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు వాతావరణ కేంద్రానికి చేరుకున్నాయి. కార్యాలయం మొత్తం అంగుళం అంగుళం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతుండటంతో ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది. అయితే, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, పరిస్థితి తమ నియంత్రణలోనే ఉందని పోలీసులు భరోసా ఇస్తున్నారు.

గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, పాఠశాలలు, కోర్టులకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు రావడం సర్వసాధారణమైపోయింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టుతో పాటు పలు జిల్లాల కోర్టులకు కూడా ఇలాంటి మెయిల్స్ వచ్చాయి. ఇవి కేవలం ఆకతాయిల పనా? లేక దీని వెనుక ఏదైనా ఉగ్రవాద సంస్థల కుట్ర ఉందా? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *