Russian oil: మధ్యప్రాచ్యం(Middle East) లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రంలో నిలిచిపోయిన రష్యన్ చమురు రవాణా నౌకలను భారత్ కొనుగోలు చేయడానికి అమెరికా ప్రభుత్వం 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు (Waiver) మంజూరు చేసింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఎందుకు ఈ మినహాయింపు?
సాధారణంగా రష్యాపై ఉన్న ఆంక్షల వల్ల ఆ దేశం నుండి చమురు కొనడానికి అనేక పరిమితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు:
సముద్రంలో ఇప్పటికే లోడ్ అయి, నిలిచిపోయిన (Stranded) చమురును మార్కెట్లోకి పంపడం వల్ల అంతర్జాతీయ ధరలు అదుపులో ఉంటాయని అమెరికా భావిస్తోంది.
భారత్ తన చమురు అవసరాల కోసం 40% వరకు మధ్యప్రాచ్యం(Middle East)పై ఆధారపడుతుంది. ప్రస్తుతం అక్కడ యుద్ధం జరుగుతుండటంతో, భారత్‌కు ఇంధన భద్రత కల్పించడం వ్యూహాత్మకంగా అవసరమని అమెరికా గుర్తించింది.
రష్యాకు పెద్దగా లాభం ఉండదు!
ఈ 30 రోజుల మినహాయింపు వల్ల రష్యా ప్రభుత్వానికి భారీ ఆర్థిక ప్రయోజనం ఉండదని అమెరికా స్పష్టం చేసింది.
ఇది కేవలం సముద్రంలో ప్రయాణిస్తున్న లేదా నిలిచిపోయిన నౌకలకు మాత్రమే వర్తిస్తుంది. కొత్త ఒప్పందాలకు కాదని అధికారులు తెలిపారు. భారత్ భవిష్యత్తులో రష్యా కంటే అమెరికా నుండే ఎక్కువ చమురును కొనుగోలు చేస్తుందని తాము ఆశిస్తున్నట్లు స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు.
రంగంలోకి భారత ప్రభుత్వ సంస్థలు
అమెరికా మినహాయింపు ఇవ్వడంతో భారత ప్రభుత్వ రంగ సంస్థలైన IOC, BPCL, HPCL, MRPL మరియు ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ రష్యా నుండి చమురు దిగుమతి చేసుకునేందుకు చర్చలు మొదలుపెట్టాయి.
పెరిగిన ధరలు: ఫిబ్రవరిలో బ్రెంట్ క్రూడ్ కంటే తక్కువ ధరలో లభించిన రష్యా ఆయిల్, ఇప్పుడు మార్చి-ఏప్రిల్ నాటికి బ్రెంట్ కంటే 4 నుండి 5 డాలర్లు ఎక్కువ ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. ధర ఎక్కువైనా సరే, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో చమురు లభ్యతే ముఖ్యం కావడంతో భారత సంస్థలు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నాయి.
