AP Council

AP Council: ఏపీ శాసన మండలిలో సెగలు.. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో గందరగోళం!

AP Council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఈరోజు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు సభలో పెద్ద దుమారాన్నే రేపాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు కొనసాగుతున్న వేళ, మతం ప్రస్తావన రావడంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాగే మండలి చైర్మన్ మోషేన్ రాజు ఇద్దరూ క్రైస్తవులంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్రబిందువయ్యాయి.

మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై మండలి చైర్మన్ మోషేన్ రాజు తీవ్రంగా స్పందించారు. తాను క్రైస్తవుడిని కాదని, హిందువునని ఆయన స్పష్టం చేశారు. తనను కావాలనే వేరే మతానికి చెందిన వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సభలో నిరసనకు దిగారు. అచ్చెన్నాయుడు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా, చైర్మన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఈ ఉద్రిక్తతల మధ్య మంత్రి అచ్చెన్నాయుడు వివరణ ఇస్తూ.. తాను చైర్మన్‌ను క్రైస్తవుడిగా భావించానని, కానీ ఆయన హిందువునని చెప్పినందున తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. చైర్మన్‌కు జరిగిన అసౌకర్యానికి తాను తప్పు ఒప్పుకుంటున్నానని తెలిపారు. అయినప్పటికీ వైసీపీ సభ్యుల నిరసనలు తగ్గకపోవడంతో, పరిస్థితి అదుపులోకి రాక సభ కాసేపు వాయిదా పడింది. లడ్డూ వ్యవహారం కాస్తా చివరకు వ్యక్తిగత మరియు మతపరమైన విమర్శల దిశగా మళ్లడం చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *