Bandi Sanjay: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా (HYDRAA) కూల్చివేతలు ఇంకా బఫర్ జోన్ నిబంధనలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం (మార్చి 1) హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, గాంధీ విగ్రహం ఏర్పాటు పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం అత్యంత అమానుషమని మండిపడ్డారు. ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్ సాకుతో సామాన్యుల పొట్ట కొట్టవద్దని, ఒకవేళ పేదల ఇళ్ల జోలికి వస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు.
వివక్షపూరిత నిర్ణయాలు.. విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన
కూల్చివేతల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. “పాతబస్తీలో ఒవైసీకి చెందిన కాలేజీని కూల్చడానికి పరీక్షలు అడ్డువచ్చాయని చెబుతున్న ప్రభుత్వం, ఖమ్మంలో ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల పరిస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు. ఒకరి కళ్లలో ఆనందం కోసం మరొకరి జీవితాలను నాశనం చేయడం సరికాదని హితవు పలికారు. బాన్సువాడలో హిందువులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం.. రాహుల్ గాంధీపై విమర్శలు
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పటికే అంతర్గత పోరు మొదలైందని, మంత్రుల మధ్య సఖ్యత లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. “రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నది కేవలం మూటల (నిధుల) కోసమే తప్ప ప్రజల కోసం కాదు” అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు తమ పద్ధతి మార్చుకోకపోతే, బీజేపీ తలుచుకుంటే వారు బయట తిరగలేని పరిస్థితి వస్తుందని ఘాటుగా హెచ్చరించారు.
హిందువులంతా ఏకం కావాలి
హిందూ సమాజానికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని బండి సంజయ్ పేర్కొన్నారు. పేదల ఇళ్లు కూల్చే ధైర్యం ఉంటే, ముందుగా చెరువులను ఆక్రమించిన బడా బాబుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయాలని డిమాండ్ చేశారు. సామాన్యులకు అన్యాయం జరిగితే బీజేపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
