Breakfast Scheme

Breakfast Scheme: తెలంగాణ అంగన్‌వాడీల్లో ఇకపై అల్పాహారం.. మంత్రి సీతక్క కీలక ప్రకటన.. పోషకాహార లోపానికి చెక్!

Breakfast Scheme: తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకునే చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ పిల్లలకు ఇకపై ప్రతిరోజూ పౌష్టిక విలువలతో కూడిన అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) అందించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. శనివారం (ఫిబ్రవరి 28) హైదరాబాద్‌లోని శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె ఈ కీలక ప్రకటన చేశారు. తొలుత కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి, ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

పోషకాహార లోప రహిత తెలంగాణే లక్ష్యం

రాష్ట్రంలోని చిన్నారులు, గర్భిణీలు మరియు బాలింతల్లో పోషకాహార లోపం (Malnutrition) లేకుండా చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ మరియు మారుమూల ప్రాంతాల్లోని కౌమార బాలికలను వేధిస్తున్న రక్తహీనత (Anemia) సమస్యను తగ్గించేందుకు అదనపు పోషకాహార పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, నిధుల కేటాయింపులు మరియు భవిష్యత్ ప్రణాళికలపై శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషనర్ శ్రుతి ఓజాతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు.

భవన నిర్మాణాలపై ప్రత్యేక నజర్

అంగన్‌వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాలపై మంత్రి సీతక్క అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,199 కొత్త అంగన్‌వాడీ భవనాలు మంజూరైనప్పటికీ, ఇప్పటివరకు కేవలం 500 భవనాలు మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ‘సాక్ష్యం అంగన్‌వాడీ’ కార్యక్రమం కింద ప్రతి కేంద్రంలో పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ప్రీ-స్కూల్ విద్య ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

బాల్య వివాహాల నిర్మూలనకు పిలుపు

పోషకాహారంతో పాటు సామాజిక రుగ్మతల పైన కూడా మంత్రి దృష్టి సారించారు. తెలంగాణను బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ములుగు జిల్లాలో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌గా చిన్నారులకు పాలు అందిస్తున్నామని, దీని ఫలితాలను బట్టి ఇతర జిల్లాలకు విస్తరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో టీజీ ఫుడ్స్ ఛైర్మన్ ఫహీం, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *