Delhi Liquor Policy Case

Delhi Liquor Policy Case: అధర్మం ఓడింది.. ధర్మమే గెలిచింది.. సీబీఐ క్లీన్ చిట్‌పై స్పందించిన కవిత

Delhi Liquor Policy Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, కల్వకుంట్ల కవితకు ఊరట లభించింది. ఈ కేసులో తగిన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. సీబీఐ దాఖలు చేసిన అభియోగాల్లో పసలేదని, సరైన సాక్ష్యాలు లేకుండానే కేసులో ఇరికించారని కోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు కూడా ఈ తీర్పుతో పెద్ద ఉపశమనం లభించింది.

దాదాపు ఐదు నెలల పాటు జైలు జీవితం గడిపిన కవితపై సీబీఐ మోపిన చార్జ్‌షీట్‌లో అనేక లోపాలు ఉన్నాయని న్యాయమూర్తి జితేందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. కేవలం ఊహాజనిత ఆరోపణలే తప్ప, వాటిని నిరూపించే బలమైన స్టేట్‌మెంట్లు కానీ, పక్కా ఆధారాలు కానీ లేవని కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో కవితపై ఉన్న అన్ని క్రిమినల్ అభియోగాలు కొట్టివేయబడ్డాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

కోర్టు తీర్పు వెలువడిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. చివరకు నిజమే గెలిచిందని, తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా తనను, తన కుటుంబాన్ని మానసిక వేదనకు గురి చేశారని ఆవేదన చెందారు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రతోనే ఈ తప్పుడు కేసులో తనను ఇరికించారని ఆమె విమర్శించారు.

సోషల్ మీడియాలో తనపై వచ్చిన ట్రోల్స్, విమర్శలను ఎదుర్కొంటూ కష్టకాలంలో తనకు అండగా నిలిచిన తల్లిదండ్రులు, అత్తమామలు మరియు పార్టీ కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు నడిచిందని కోర్టు తీర్పు ద్వారా నిరూపితమైందని కవిత ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయం తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరిదని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *