Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో మెడికల్ సీట్ల పేరుతో భారీ మోసం: లేడీ డాక్టరుకే రూ. 19 లక్షల నామం!

Hyderabad: హైదరాబాద్ నగరంలో ఎంబీబీఎస్ సీట్ల పేరుతో జరుగుతున్న మోసాలు మరోసారి కలకలం రేపాయి. సాధారణ ప్రజలే కాదు, విద్యావంతులైన డాక్టర్లు కూడా ఈ మాయగాళ్ల వలలో చిక్కుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. తన కుమారుడికి మెడికల్ సీటు వస్తుందని నమ్మిన ఓ మహిళా గైనకాలజిస్ట్‌ను ఒక నకిలీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఏకంగా రూ. 18.9 లక్షలకు ముంచేసింది. ఫేస్‌బుక్‌లో వచ్చిన ఆకర్షణీయమైన ప్రకటనను నమ్మి ఆమె తన కష్టార్జితాన్ని పోగొట్టుకున్నారు.

అమీర్‌పేట్ కేంద్రంగా నడుస్తున్న ఒక ‘నీట్ కౌన్సెలింగ్ ఫర్మ్’ ప్రతినిధులు, సదరు డాక్టరును నమ్మించి మొదట సర్వీస్ ఛార్జీల పేరుతో రూ. 5 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత ఎల్‌బీ నగర్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ ఖరారైందని నకిలీ అలాట్‌మెంట్ లెటర్ చూపించి, మరో రూ. 13.9 లక్షలు గుంజుకున్నారు. తీరా కాలేజీకి వెళ్లి విచారిస్తే, ఆ లెటర్ ఫేక్ అని తెలియడంతో ఆమె షాక్‌కు గురయ్యారు. డబ్బులు తిరిగి అడిగితే వారు కాలయాపన చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

ప్రస్తుతం ఈ కేసు విచారణను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఈ ముఠా ఒక్క డాక్టరునే కాకుండా, మరికొందరు తల్లిదండ్రుల నుంచి కూడా లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు తేలింది. ఇప్పటివరకు సుమారు రూ. 1.15 కోట్ల వరకు ఈ స్కామ్ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కన్సల్టెన్సీ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

పోలీసుల హెచ్చరిక:
మెడికల్ సీట్ల విషయంలో సోషల్ మీడియాలో వచ్చే ‘గ్యారెంటీ సీటు’ లేదా ‘డైరెక్ట్ అడ్మిషన్’ వంటి ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అడ్మిషన్లు అనేవి కేవలం అధికారిక నీట్ (NEET) కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారానే జరుగుతాయని, అడ్డదారిలో సీట్లు ఇప్పిస్తామనే వారంతా మోసగాళ్లేనని స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *