Tirumala: తిరుమల కొండపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎంతో భక్తితో వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, ఆ సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్తున్న ఇద్దరు భక్తులను విధి వంచించింది. బైక్ అదుపుతప్పి కింద పడటంతో ఒక భక్తుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు.
తమిళనాడు రాష్ట్రం అరక్కోణం ప్రాంతానికి చెందిన నటరాజన్, మునిరత్నం అనే ఇద్దరు స్నేహితులు కలిపి శ్రీవారి దర్శనం కోసం బైక్పై తిరుమలకు వచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న తర్వాత, ఎంతో ప్రశాంతంగా తిరిగి తమ ఊరికి బయలుదేరారు. అయితే, మొదటి ఘాట్ రోడ్డులోని 30వ మలుపు వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పింది. వేగంగా వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది.
ఈ భయంకరమైన ప్రమాదంలో నటరాజన్ తలకి తీవ్రమైన గాయమవ్వడంతో అక్కడికక్కడే కన్నుమూశారు. అతనితో పాటు ఉన్న మునిరత్నానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై వెళ్తున్న ఇతర భక్తులు ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది, గాయపడిన వ్యక్తిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం పంపి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దైవ దర్శనం చేసుకుని వెళ్తూ ఇలా ప్రమాదానికి గురికావడం స్థానికులను, ఇతర భక్తులను తీవ్రంగా కలచివేసింది. ఘాట్ రోడ్లలో ప్రయాణించేటప్పుడు భక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
