Delhi

Delhi: సినిమా స్టైల్‌లో భారీ దోపిడీ.. ఈడీ పేరుతో వచ్చి నగదుతో పరార్.

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఒక వింతైన దొంగతనం వెలుగులోకి వచ్చింది. అచ్చం ‘స్పెషల్ 26’ సినిమాను తలపించేలా కొందరు దుండగులు నకిలీ అధికారుల అవతారమెత్తారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులమని నమ్మిస్తూ ఒక ఇంట్లోకి చొరబడి, అందినకాడికి దోచుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అసలు కథ ఇదీ..
ఈ దోపిడీ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఆ ఇంట్లో పనిచేసే పనిమనిషి. యజమాని ఇంట్లో ఉన్న సంపదపై కన్నేసిన ఆమె, ఎలాగైనా ఆ సొమ్మును కొట్టేయాలని పన్నాగం పన్నింది. ఇందుకోసం తన స్నేహితులతో కలిసి ఒక పక్కా ప్లాన్ వేసింది. ఇంట్లో ఎప్పుడు ఎవరు ఉంటారు? నగదు ఎక్కడ ఉంటుంది? అనే విషయాలన్నింటినీ తన గ్యాంగ్‌కు ముందే చేరవేసింది.

దోపిడీ సాగిందిలా..
పథకం ప్రకారం, నిందితులు పోలీస్ యూనిఫామ్‌లు ధరించి న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని ఆ ఇంట్లోకి ప్రవేశించారు. తాము అధికారులమని, తనిఖీలు చేయాలని బెదిరించి నానా హంగామా చేశారు. ఇంట్లో ఉన్న సుమారు 4 లక్షల రూపాయల నగదుతో పాటు, అత్యంత విలువైన వాచీలను మూటగట్టుకుని అక్కడి నుంచి పరారయ్యారు. అధికారులు అని నమ్మడంతో యజమానులు మొదట అడ్డు చెప్పలేకపోయారు.

పోలీసుల వేట – నిందితుల అరెస్ట్
బాధితులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. దాదాపు 350 సీసీటీవీ కెమెరాలను నిశితంగా పరిశీలించి, నిందితుల కదలికలను గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకుని, వారి వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పనిమనిషే ఈ దొంగతనానికి ప్లాన్ వేసిందని తేలడంతో అందరూ విస్తుపోయారు. ప్రస్తుతం నిందితులందరూ పోలీసుల అదుపులో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *