Pawan Kalyan

Pawan Kalyan: కల్తీ నెయ్యి వ్యవహారం.. దోషులు ఎవరైనా వదిలేది లేదు

Pawan Kalyan: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశంపై తాజాగా శాసనసభలో జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారు ఎంతటి వారైనా సరే, కఠినంగా శిక్షించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కల్తీ వ్యవహారం కేవలం ఒక తప్పు మాత్రమే కాదని, ఇది కోట్లాది మంది నమ్మకానికి సంబంధించిన ధర్మ సంకటమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్‌డీడీబీ నివేదికలో తేలిందని పవన్ గుర్తు చేశారు. అసలు అది నెయ్యే కాదని సాక్షాత్తూ సీబీఐ కూడా నివేదిక ఇచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కల్తీకి సంబంధించి ఏయే రసాయనాలు వాడారో ఆ దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించారు. హిందూ మతంతో పాటు అన్ని మతాలను గౌరవించడం మన దేశ సంస్కృతి అని, అలాంటిది పవిత్రమైన తిరుమల ప్రసాదం విషయంలో ఇంత నిర్లక్ష్యం వహించడం క్షమించరాని నేరమని ఆయన పేర్కొన్నారు.

గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం పాత బోర్డు సభ్యులను జగన్ గారు ఎందుకు వెనకేసుకొస్తున్నారని పవన్ ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని సమర్థించడం చూస్తుంటే, ఇందులో వారి ప్రమేయం కూడా ఉందేమో అన్న అనుమానం కలుగుతోందని పవన్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అపవిత్ర పనులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, దోషులకు శిక్ష పడే వరకు ప్రభుత్వం వెనకడుగు వేయదని ఆయన భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *