Pawan Kalyan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై జరుగుతున్న చర్చలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో తాను ఎప్పుడూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా నిందించలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆ సమయంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిదే పూర్తి బాధ్యత అని ఆయన గట్టిగా చెప్పారు. బోర్డు సభ్యులు చేసిన తప్పుల వల్లే శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్‌డీడీబీ నివేదికలో స్పష్టంగా తేలిందని పవన్ గుర్తు చేశారు. కల్తీ జరిగిందని నిజాయితీగా ఒప్పుకుంటే ఈ గొడవ ఇంత దూరం వచ్చేది కాదని, కానీ తప్పు చేసిన వారిని వెనకేసుకురావడం సరికాదని ఆయన విమర్శించారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం వెనుక ఒక పద్ధతి ప్రకారం జరిగిన కుట్ర ఉందని సిట్ (SIT) విచారణలో తేలిందని ఆయన సంచలన విషయాలు వెల్లడించారు.
శ్రీవారి లడ్డూకి వాడిన నెయ్యిలో అసలు నెయ్యి లక్షణాలే లేవని, అదంతా రసాయనాల మయమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇలాంటి అపచారం వేరే మతాల్లో జరిగి ఉంటే ప్రపంచమంతా గగ్గోలు పెట్టేదని, హిందూ ధర్మం విషయంలోనే ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని ఆయన ప్రశ్నించారు. ఈ కల్తీ వ్యవహారం వెనుక ఉన్న అసలు దోషులు ఎవరైనా సరే, వారికి కఠిన శిక్ష పడాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
చివరగా, రాష్ట్రంలోని ఆలయాల పరిస్థితిపై స్పందిస్తూ శ్రీకృష్ణ దేవరాయల ‘ఆముక్తమాల్యద’లోని పద్యాన్ని పవన్ చదివి వినిపించారు. ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని గుర్తు చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
