Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై వేడివేడి చర్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ చర్చలో పాల్గొని గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన టీటీడీ పాలక మండలి తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైందని, దీనివల్ల కోట్ల మంది హిందువుల సెంటిమెంట్ దెబ్బతిన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ నాణ్యత విషయంలో అప్పట్లోనే ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు.
నెయ్యిలో నెయ్యే లేదు: పవన్ సంచలన వ్యాఖ్యలు
సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కల్తీ నెయ్యి తయారీలో గత పాలకులు వింతైన ‘సృజనాత్మకత’ చూపించారని ఎద్దేవా చేశారు.
నెయ్యి అంటే పాలనుంచి రావాలి, కానీ రసాయనాల నుంచి కూడా నెయ్యిని తయారు చేయవచ్చని గత హయాంలో నిరూపించారని విమర్శించారు. లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతు సంబంధ రసాయనాలు ఉన్నాయని ఎన్డీడీబీ (NDDB) రిపోర్ట్ స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు. అసలు ఆ నెయ్యిలో నెయ్యే లేదని ఇప్పటికే తేలిపోయిందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
20 కోట్ల లడ్డూలు కల్తీ.. అయోధ్యకు కూడా!
గత ప్రభుత్వ హయాంలో సుమారు 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితోనే తయారయ్యాయని సిట్ (SIT) విచారణలో తేలిందని పవన్ వెల్లడించారు.
- అయోధ్య ప్రసాదం: అత్యంత పవిత్రమైన అయోధ్య రామాలయానికి కూడా కల్తీ నెయ్యితో చేసిన లక్ష లడ్డూలను పంపడం విచారకరమన్నారు.
- నిబంధనల సడలింపు: నచ్చిన వారికి కాంట్రాక్టులు ఇచ్చుకునేందుకే గతంలో నిబంధనలను సడలించారని, ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు పథకం ప్రకారమే కుట్ర జరిగిందని ఆరోపించారు.
సనాతన ధర్మ రక్షణ బోర్డు ఆవశ్యకత
ఆలయాలపై దాడులు జరిగినప్పుడు లేదా ప్రసాదం అపవిత్రం అయినప్పుడు స్పందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అందుకే దేశవ్యాప్తంగా దేవాలయాల పరిరక్షణ కోసం ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఉండాలని తాను గట్టిగా కోరుకుంటున్నట్లు పునరుద్ఘాటించారు. తప్పు జరిగిందని ఒప్పుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాల్సింది పోయి, వైసీపీ నేతలు సమర్థించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కేసులో దోషులు ఎంతటి వారైనా సరే కఠిన శిక్ష పడాల్సిందేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
