Hyderabad

Hyderabad: హైదరాబాద్ పోలీసుల మెరుపు దాడి.. 104 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్!

Hyderabad: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో చేపట్టిన భారీ ఆపరేషన్‌లో భాగంగా ఏకంగా 104 మంది సైబర్ నేరగాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా, దేశంలోని 16 రాష్ట్రాల్లో 32 ప్రత్యేక బృందాలు 10 రోజుల పాటు గాలించి ఈ ముఠాను పట్టుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో పోలీసులకు చిక్కిన వారిలో కొందరు బ్యాంక్ అధికారులు కూడా ఉండటం గమనార్హం.

ఈ నేరగాళ్ల నెట్‌వర్క్ ఎంత పెద్దదంటే.. వీరిపై దేశవ్యాప్తంగా దాదాపు 1,055 కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పటి వరకు వీరు అమాయకుల నుంచి సుమారు 127 కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రజల కష్టార్జితాన్ని మాయమాటలతో, టెక్నాలజీని అడ్డుపెట్టుకుని కొల్లగొట్టడంలో వీరు ఆరితేరిపోయారు.

అరెస్టయిన వారి వద్ద నుండి పోలీసులు భారీగా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 36 లక్షల రూపాయల నగదు, 204 మొబైల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు ఉన్నాయి. అంతేకాకుండా, నేరాలకు వాడిన 152 బ్యాంక్ పాస్‌బుక్కులు, 234 డెబిట్ కార్డులు మరియు 26 ల్యాప్‌టాప్‌లను కూడా సీజ్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున సైబర్ నేరగాళ్లను ఒకేసారి పట్టుకోవడం పోలీసుల చాకచక్యానికి నిదర్శనమని చెప్పవచ్చు.

సైబర్ నేరాలు పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తెలియని వ్యక్తులకు బ్యాంక్ వివరాలు చెప్పడం, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం వంటివి చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *