Hyderabad

Hyderabad: అంబర్‌పేట్‌లో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య.. అసలేం జరిగింది?

Hyderabad: హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పరిధిలో గుండెలవిసే విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. వ్యాపారంలో వచ్చిన నష్టాలు, పెరుగుతున్న అప్పుల భారం తట్టుకోలేక తండ్రి, తల్లి, కొడుకు ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

అసలేం జరిగిందంటే?
అంబర్‌పేట్‌లో నివసించే రామ్ రాజ్ (55) నగరంలో హోటల్ వ్యాపారం చేసేవారు. మల్లపల్లిలో బిర్యానీ సెంటర్, అంబర్‌పేట్‌లో ల్యాండ్‌మార్క్ హోటల్‌ను ఆయన నిర్వహించేవారు. అయితే గత కొంతకాలంగా వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అప్పుల భారం ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన రామ్ రాజ్, తన భార్య మాధవి (50), కొడుకు శశాంక్‌తో కలిసి ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఘటనా స్థలంలో ఏం కనిపించింది?
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఈ ఆత్మహత్యలు చాలా ప్రణాళికాబద్ధంగా జరిగినట్లు తెలుస్తోంది. మొదట తల్లి మాధవి ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత కొడుకు శశాంక్ తన మణికట్టు కోసుకుని, అనంతరం ఉరివేసుకున్నాడు. చివరిగా రామ్ రాజ్ కూడా ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. చనిపోయే ముందు తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో రామ్ రాజ్ తన స్నేహితుడు రవికి వాట్సాప్‌లో మెసేజ్ పంపారు. ఆ మెసేజ్ చూసి కంగారుగా ఇంటికి వచ్చిన రవికి, మిత్రుడి కుటుంబం విగతజీవులుగా కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సూసైడ్ నోట్‌లో ఏముంది?
ఘటనా స్థలంలో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో తమ ఆత్మహత్యకు గల కారణాన్ని స్పష్టంగా వివరించారు. ఆర్థిక భారం భరించలేకనే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాము అని అందులో రాసి ఉంది. పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పులు ఇచ్చిన వారు ఎవరైనా బెదిరించారా? లేక కేవలం నష్టాల భయంతోనే ఇలా చేశారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *