Nara Lokesh

Nara Lokesh: క్రికెట్ మ్యాచ్‌కు జగన్ వస్తానంటే.. నేనే టికెట్ కొనిస్తా

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో మంత్రి నారా లోకేష్ మీడియా మిత్రులతో సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా గత వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్‌కు వెళ్తే తాను తప్పకుండా చూస్తానని, ఒకవేళ పులివెందుల ఎమ్మెల్యే కూడా మ్యాచ్ చూడాలనుకుంటే, ఆయనకు కూడా టికెట్ తానే కొనిస్తానని లోకేష్ సరదాగా వ్యాఖ్యానించారు.

తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంపై స్పందిస్తూ, నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని లోకేష్ స్పష్టం చేశారు. మార్కెట్‌లో కిలో నెయ్యి ధర వెయ్యి రూపాయలకు పైగా ఉంటే, కేవలం 360 రూపాయలకే ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అంత తక్కువ ధరకు వచ్చేది కచ్చితంగా కల్తీ నెయ్యేనని ఆయన తేల్చి చెప్పారు. అలాగే హెరిటేజ్ సంస్థ గురించి వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తూ, ప్రభుత్వం నుంచి హెరిటేజ్ ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదని, అనవసరంగా సెబీకి ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇక గత ప్రభుత్వ హయాంలో సాక్షి, భారతి సిమెంట్స్ వంటి సంస్థలు సుమారు 1000 కోట్ల రూపాయల మేర లబ్ధి పొందాయని లోకేష్ ఆరోపించారు. బడ్జెట్‌పై చర్చ జరగాలని ఇప్పుడు కోరుతున్న వైకాపా సభ్యులు, గత నాలుగు రోజులుగా సభను ఎందుకు అడ్డుకున్నారని ఆయన నిలదీశారు. వాస్తవాలు మాట్లాడకుండా కేవలం విమర్శల కోసమే సభలో రచ్చ చేస్తున్నారని ఆయన విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *