Adulterated Ghee Case

Adulterated Ghee: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం.. రేపు అసెంబ్లీలో కీలక చర్చ!

Adulterated Ghee: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై రేపు రాష్ట్ర అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కేవలం ఈ అంశం పైనే చర్చ జరగనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చెందిన సుమారు 10 మంది ఎమ్మెల్యేలు ఈ చర్చలో పాల్గొని తమ గళాన్ని వినిపించనున్నారు.

ఈ చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. భక్తి భావంతో ముడిపడిన అంశం కావడంతో ఆయన ఇచ్చే వివరణపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీ వేదికగా ఒక కీలక ప్రకటన చేయనున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, విచారణ ఎక్కడి వరకు వచ్చింది అనే విషయాలను ఆయన వెల్లడించే అవకాశం ఉంది.

మరోవైపు, తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ నిబంధనలను ప్రభుత్వం మరింత కఠినతరం చేస్తోంది. అన్యమతస్థులు ఎవరైనా సరే శ్రీవారిని దర్శించుకోవాలంటే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనను ఇకపై కచ్చితంగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. దీనివల్ల భక్తుల విశ్వాసాలను గౌరవించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

అంతేకాకుండా, అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం తరహాలోనే తిరుమలకు కూడా ఒక పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు. స్వర్ణ దేవాలయం చట్టం ప్రకారం.. ఆలయ పవిత్రతకు భంగం కలిగించినా లేదా ఏదైనా తప్పు చేసినా వారిపై నేరుగా క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. ఈ చట్టాన్ని అధ్యయనం చేసి, తిరుమలలో కూడా అమలు చేసేలా నివేదిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *